తొలిప్రేమ  రివ్యూ

బ్యానర్ : శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర
ఎడిటింగ్ : నవీన్ నూలి
సంగీతం: ఎస్.తమన్
కెమెరా : జార్జ్ సి.విలియమ్స్
నిర్మాత: బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్
కథ, కథనం, దర్శకత్వం: వెంకీ అట్లూరి
తారాగణం: వరుణ్ తేజ్, రాశీ ఖన్నా, సుహాసిని, సప్న పబ్బి, ప్రియదర్శి, హైపర్ ఆది, విద్యుల్లేఖా రామన్ తదితరులు
విడుదల : ;10 – 02 – 2018
రేటింగ్ : 3 స్టార్స్

మెగా వారసత్వాన్ని పుణికిపుచ్చుకుని హీరోగా ఎంట్రీ ఇచ్చిన వరుణ్ తేజ్ .. మొదటి నుండి కొత్తగా ప్రయత్నం చేస్తూ తనదైన ఇమేజ్ ని క్రియేట్ చేసుకుంటున్నాడు. తనకున్న మాస్ ఇమేజ్ ని పక్కన పెట్టి భిన్నమైన కథలను ఎంచుకుంటూ ఇలా కొత్తగా మనం ఎందుకు చేయకూడదు అన్న ఆసక్తితో సినిమాలు చేస్తున్నాడు. ఇటీవలే ఫిదా లాంటి సంచలన విజయం అందుకున్న వరుణ్ తేజ్ .. తాజాగా తన తొలిప్రేమ జ్ఞాపకాలను పంచుకునేందుకు వచ్చాడు. కొత్త దర్శకుడు వెంకీ అట్లూరి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ఈ రోజు విడుదలైంది. పవన్ కెరీర్ నే టర్న్ చేసిన తొలిప్రేమ టైటిల్ ని పెట్టుకున్న ఈ సినిమా మొదటి నుండి పెద్దగా అంచనాలు కూడా లేకుండా విడుదల కావడం విశేషం. మరి ఈ ఈసినిమాలో వరుణ్ తొలిప్రేమ గురించి తెల్సుకోవాలంటే .. కథలోకి వెళ్లాల్సిందే ..

కథ:

ప్రతి మనిషి జీవితంలో .. జరిగే సంఘటన .. ఎన్నటికీ మరచిపోని అందమైన జ్ఞాపకం తొలిప్రేమ. అది ఎక్కడ ఎప్పుడు ఎవ్వరి పై పుడుతుందో చెప్పలేం .. అలాంటి తొలిప్రేమలు అందరికి దక్కవు .. జీవితంలో కొత్త ఉత్సహాన్ని .. సరికొత్త అనుభూతిని మిగిల్చే ఈ తొలిప్రేమ మన కథానాయకుడి విషయంలో కూడా జరిగింది. ఈ కథలో హీరో ఆదిత్య (వరుణ్ తేజ్) మంచి తెలివైన కుర్రాడు .. పైగా చదువులో ఫస్ట్, తాను కరెక్ట్గానే ఆలోచించి ఏ పనైనా చేస్తాను. అందులో ఏ తప్పు ఉండదనుకునే యువకుడు. ఇక హీరోయిన్ వర్ష (రాశీఖన్నా) ఏ విషయాన్నైనా పలువిధాలుగా ఆలోచించి డెసిషన్ తీసుకొనే అమ్మాయి. వీరిద్దరూ అనుకోకుండా ఓ రైలు ప్రయాణంలో కలుకుంటారు. వర్షను చుసిన ఆదిత్య కు .. బాగా నచ్చేస్తుంది.. మనసులో ఏదైనా అనుకొంటే ఎలాంటి జంకూబొంకూ లేకుండా చెప్పేసే ఆదిత్య పరిచయమైన గంటలోనే వర్షకి “ఐ లవ్ యూ” చెబుతాడు .. దాంతో షాక్ అయినా ఆమె .. మాత్రం “ముందు కలసి ప్రయాణం మొదలెడదాం” అంటూ తన ఇష్టాన్ని మనసులోనే దాచుకొంటుంది. అలా మొదలైన ఆదిత్య-వర్షల ప్రయాణ గాధ ఎన్నో ఎమోషన్స్ ని దాటుకుని ఎక్కడికి చేరింది .. ఆ తరువాత విడిపోయి మళ్ళీ ఆరేళ్ల తర్వాత ఒకే కంపెనీలో ఇద్దరూ కలుస్తారు. అప్పుడు వారి మానసిక సంఘర్షణ ఏంటి? అసలు వీరిద్దరూ ఒక్కటయ్యారా ? లేదా అన్నదే మిగతా కథ ..

ఉన్నవి :

వరుణ్, రాశీల మధ్య తొలిప్రేమ రైల్లో పుట్టడం ద్వారా వారి జీవితం ప్రారంభమవుతుంది. ఓకే కాలేజీలో సీనియర్ల ర్యాగింగ్, సహచరులు మధ్య ఆటపట్టించే సన్నివేశాలతో చకచక కథ సాగిపోతుంటుంది. ప్రేమలో ఇష్టాఅయిష్టాలను, ప్రేమానురాగాలను చిన్న సంఘటనలు, సన్నివేశాల ద్వారా సినిమా ఆసక్తిగా మారుతుంది. ఫిదాలో ఎన్నారై యువకుడిగా, పరిణితితో కూడుకున్న పాత్రలో కనపడ్డ వరుణ్ తేజ్ ఈ సినిమా లవర్ బాయ్ గా భిన్నంగా కనపడ్డాడు. ప్రేమ, విడిపోవడం అనే సందర్భాల్లో వచ్చే బాధను.. ఆ ఎమోషన్స్ ను తన పాత్రలో చక్కగా చూపించాడు. వర్ష పాత్రలో రాశీ ఖన్నా చక్కగా చేసింది. పాత్ర కోసం సన్నబడటం..మళ్ళీ కొంత లావు అవ్వడం లాంటి ఫిజికల్ మార్పును బాగా చూపించిది. తన హావభావాలు, కారులోని రొమాంటిక్ సీన్ అన్నీ ఆకట్టుకుంటాయి. సప్న పబ్బి పాత్ర చిన్నదే అయినా ఉన్నంతలో మెప్పించింది. ప్రియదర్శి, బజర్దస్త్ ఆది, సుహాసిని, విద్యుల్లేఖా రామన్ తదితరులు వారి వారి పాత్రలతో మెప్పించారు.

లేనివి :

దర్శకుడు వెంకీ అట్లూరి తొలి సినిమా ఇది. మంచి ఫీల్ గుడ్ లవ్స్టోరీ. ప్రేమ కథ అంటే ప్రేమికులు కలుసుకోవడం.. విడిపోవడం.. మళ్లీ కలుసుకోవడం అనే పాయింట్ కామన్గానే ఉంటుంది. ఇలాంటి ప్రేమ కథల్లో ఎమోషన్స్, ఫీల్ అనేది ముఖ్యం. ఈ సినిమాలో అవి మిస్ కాకుండా చూసుకున్నాడు దర్శకుడు. ప్రేమికుల మధ్య జరిగే సంఘటనలకు బలమైన సన్నివేశాలు, వాటికి మాటల పవర్ తోడవ్వడంతో సినిమా మరో స్థాయికి వెళ్ళింది. ప్రథమార్థంలో రైల్వే స్టేషన్, కాలేజ్ సీన్లు చక్కగా డీల్ చేశాడు. ఆదిత్యకు వర్ష ఐ లవ్ యూ చెప్పే సీన్, బ్రేకప్ సీన్ లాంటి తెరకెక్కించిన విధానం దర్శకుడు వెంకీ ప్రతిభకు అద్దం పడుతుంది. ప్రేమికుల మధ్య ఉండే పరిస్థితులతో చక్కటి భావోద్వేగంగా చిత్రంగా తొలిప్రేమను మలచడంలో వెంకీ అట్లూరి పూర్తిగా సఫలమయ్యాడు. చాలా రోజుల తరువాత సంగీత దర్శకుడు తమన్ మంచి సంగీతం ఇచ్చాడు. మెలోడీ సాంగ్స్, నేపధ్య సంగీతంతో ఆకట్టుకున్నాడు. సినిమా చూస్తున్న ప్రేక్షకుడిని కనెక్ట్ అయ్యేలా చేసాడు. జార్జ్ సి.విలియమ్స్ సినిమాటోగ్రఫీ సినిమాకి ప్రత్యేక ఆకర్షణ. యూత్ మూడ్‌ను ఆకట్టుకొనే విధంగా సినిమాను అందంగా తీర్చిదిద్దాడు జార్జ్. కాలేజీ సన్నివేశాలు, లండన్ ఎపిసోడ్స్‌కు అందించిన సినిమాటోగ్రఫీతో సినిమాను మరోస్థాయికి తీసుకెళ్లాడు. జార్జి సీ విలియమ్స్ కెమెరా వర్క్ ఈ సినిమాకు ఎస్సెట్ అని చెప్పవచ్చు. నవీన్ నూలి లీనియర్ స్క్రీన్ ప్లేతో నడిచే సినిమాని ప్రతి ప్రేక్షకుడికీ అర్ధమయ్యే రీతిలో ఎడిట్ చేసిన విధానం కూడా ప్లస్ అయ్యింది. సి.జి వర్క్ పరంగా ఇంకాస్త ఎక్కువ ఎఫర్ట్ పెట్టి ఉంటే బాగుండేది. ఒక కొత్త దర్శకుడి కథను నమ్మి ఖర్చుకి వెనకాడకుండా భారీ స్థాయిలో ఈ చిత్రాన్ని నిర్మించిన నిర్మాతల నిర్మాణ విలువలు బాగున్నాయి.

చివరగా :

వరుసగా వస్తున్నా రొటీన్ సినిమాలతో సతమతమవుతున్న సగటు ప్రేక్షకుడిని ఊహాలోకంలో విహరించేలా చేసిన సినిమా తొలిప్రేమ. ఒక స్వచ్చమైన సినిమా చూశామన్న అనుభూతి కలుగుతుంది. ప్రతి ఒక్కరి జీవితంలోని తొలిప్రేమ జ్ఞాపకాలను తడుముతుంది. ఈ కథలో వరుణ్ తేజ్, రాశీఖన్నా కెమిస్ట్రీ బాగా వర్కవుట్ అయింది. వీరిద్దరూ పోటాపోటీగా నటించడం వల్ల సినిమా స్థాయి మారింది. ఫస్టాఫ్ అంతా ఓ ఫీల్తో రన్ అవుతుంది. కాని సెకండాఫ్ విషయానికి వస్తే కొన్ని సన్నివేశాలు సాగదీసినట్టు కనిపిస్తాయి. సెకండాఫ్లో ఎమోషనగా సరైన విధంగా కనెక్ట్ చేయకపోవడం.. కామెడీ పెద్దగా లేకపోవడంతో కాస్త దిగాలుగా అనిపిస్తుంది.

Please follow and like us: