రా.. రా .. రివ్యూ

నిర్మాత : ఎం. విజయ్
దర్శకుడు : లేడు
సంగీతం : రాప్ రాక్ షకీల్
సినిమాటోగ్రఫర్ : పూర్ణ
ఎడిటర్ : శంకర్
నటీనటులు : శ్రీకాంత్, నజియా, సీత నారాయణ, ఆలీ, వేణు, గెటప్ శ్రీను తదితరులు ..
విడుదల తేదీ : ఫిబ్రవరి 23, 2018
రేటింగ్ : 2 / 5

స్టార్ ఇమేజ్ కోసం ఆరాటపడకుండా భిన్నమైన సినిమాలతో కెరీర్ ని చక్కగా ప్లాన్ చేసుకున్న హీరో శ్రీకాంత్. అటు మాస్ హీరోగా, ఇటు క్లాస్ హీరోగా రెండు బిన్నమైన పార్శ్వాలలో కనిపించి మెప్పించాడు. అయితే ఈ మధ్య కెరీర్ సరైన దారిలో సాగడం లేదు.. వరుస పరాజయాలతో సతమతమవుతున్న శ్రీకాంత్ పెద్ద చిత్రాల్లో సపోర్టింగ్ రోల్స్ కూడా చేస్తున్న ఆయన కథానాయకుడిగా మరోమారు తన అదృష్టాన్ని పరీక్షించుకోవడం కోసం చేసిన సినిమా ప్రస్తుతం టాలీవుడ్ లో ట్రెండ్ ను ఫాలో అవుతూ రారా అంటూ ఓ హర్రర్ సినిమాతో ముందుకు వస్తున్నాడు. మరి హారర్ సినిమాతో శ్రీకాంత్ ఎంతవరకు సక్సెస్ అయ్యాడు .. అసలు ఈ హర్రర్ సినిమాలో కొత్తగా ఏముంది అన్నది తెలుసుకోవాలంటే కథలోకి వెళ్లాల్సిందే ..

కథ:

సూపర్ హిట్ సినిమాల సీనియర్ దర్శకుడి (గిరిబాబు) తనయుడు రాజ్ కిరణ్ (శ్రీకాంత్). తండ్రిలాగే తాను కూడా పెద్ద దర్శకుడు కావాలనే ఆశయంతో ప్రయత్నాలు చేస్తుంటాడు. శాస్త్రంలో చెప్పినట్టు .. పండిత పుత్ర పరమ …. అన్న తరహాలో ఇతగాడు తీసిన రెండు సినిమాలు భారీ పరాజయాలు అందుకుంటాయి. కొడుకు ప్రయోజకుడు కాలేకపోతున్నాడన్న బెంగతో తండ్రి నిర్మాతగా మారతాడు. కానీ ఆ సినిమా కూడా భారీ పరాజయం పాలవడంతో తండ్రి గుండెపోటుతో మరణించగా ఆ షాక్ తో తల్లి ఆసుపత్రి పాలవుతుంది. తల్లి ఆరోగ్యం కుదుటపడాలంటే సరిగ్గా నాలుగు నెలల్లో ఒక సూపర్ హిట్ సినిమా తీయాలని, ఆ హ్యాపీ న్యూస్ చెబితేనే .. తన తల్లి ఆరోగ్యం బాగుపడుతుందని ప్లాన్ చేసిన రాజ్ కిరణ్ .. ఓ హర్రర్ సినీమా చేయలని ప్లాన్ చేస్తాడు. ఆ సినిమాకోసం ఓ పాడుబడిన బంగ్లాలోకి తన టీం తో సహా వెళ్తాడు. తీరా అక్కడికి వెళ్ళాక నిజమైన దెయ్యాలతో సినిమా తీయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అక్కడ ఉన్న దెయ్యాలు వాళ్ళను నా ఇబ్బందులకు గురిచేస్తూ బంగ్లా నుండి బయటకు వెళ్లకుండా చేస్తాయి. అలాంటి సమయంలో రాజ్ కిరణ్ తన ఆశయాన్ని సాధించగలిగాడా ? అతను అనుకున్నట్టు హిట్ అందుకున్నాడా ? లేదా అన్నది మిగతా కథ ..

వంద సినిమాల్లో నటించిన శ్రీకాంత్ చేసిన మొదటి హారర్ సినిమా ఇది. చాలా హుషారుగా, ఫిట్ గా కనిపిస్తూ తన పెర్ఫార్మెన్స్ తో సినిమాను భుజాల మీదే మోశాడు. కానీ హారర్ జోనర్ కావడంతో నటన విషయంలో కాస్త కన్ఫ్యూజ అయ్యాడు. ఒక రకంగా చెప్పాలంటే.. నటుడిగా శ్రీకాంత్ స్థాయిని తగ్గించే సినిమా ఇది. కామెడీ సన్నివేశాల్లో ఆయన హావా భావాలు ప్రేక్షకుల్ని తప్పకుండా నవ్విస్తాయి.ఇక హీరోయిన్లుగా నటించిన సీతా నారాయణ, నజియాలు కుదిరినంతలో అందాల ప్రదర్శన మీద దృష్టి పెట్టారు .. నటించే స్కోప్ ఎక్కడ లేదు. షకలక కాసేపు నవ్వించడానికి చేసిన ప్రయత్నం పెద్దగా వర్కవుట్ కాలేదు. ఇక రఘుబాబు, హేమ, నల్ల వేణు తదితరులు కామెడీ ఎబ్బెట్టుగా అనిపించింది. కథను, కామెడీని కలిపిన విధానం కూడ సమపాళ్లలో లేకపోవడంతో సినిమాను ఎంజాయ్ చేసే అవకాశాలు ఎక్కడ లేవు. కేవలం ద్వితీయార్థంలో మినహా మిగతా ఎక్కడా చిత్రం ఊపందుకోదు. హీరో శ్రీకాంత్ సినిమా తీయాలనుకోవడం, ఆ ప్రయత్నంలో దెయ్యంతో ప్రేమలో పడటం వంటి అంశాలను మరీ సాగదీశారు.

టెక్నీకల్ విషయాల గురించి పెద్దగా మాట్లాడుకోవాల్సిన పనిలేకుండా చేసారు .. ర్యాప్ రాక్ షకీల్ బాణీలే అర్ధం కాలేడు.. ఇక నేపధ్య సంగీతం అయితే పిచ్చెక్కిస్తుంది. పూర్ణ సినిమాటోగ్రఫీ యావరేజ్. ఈమధ్య షార్ట్ ఫిలిమ్ మేకర్సే ఇంకా బాగా తీస్తున్నారు అనిపిస్తుంది. ఎడిటింగ్, గ్రాఫిక్స్, లాంటి సాంకేతికపరమైన విషయాల గురించి మాట్లాడుకోవాల్సిన అవసరం కూడా లేదు. కొన్ని గొడవల మూలాన దర్శకుడు సినిమా మధ్యలో తప్పుకోవడంతో ఇతర టీమ్ కలిసి ఎలాగోలా సినిమాను పూర్తిచేయాలని చేసిన ప్రయత్నం బెడిసి కొట్టింది. కొత్తదనం లేని పాయింట్‌తో దర్శకుడు రారా సినిమాను నాసిరకంగా మలిచాడనే భావన కలుగుతుంది. పాత రికార్డుల అరిగిపోయిన రోటీన్ సీన్లు విసుగు కలిగిస్తాయి. ఆసక్తికరంగా లేని సీన్లకు తోడు నిడివి మరొక ఇబ్బంది కలిగించే అంశమని చెప్పవచ్చు. దర్శకత్వ పరమైన లోటుపాట్లకు ఎవరి బాధ్యత తీసుకుంటారో మరి . ఇక సినిమా నిర్మాణ విలువలు పర్వాలేదు.

తెలుగులో టాలీవుడ్‌లో ఎలాంటి అంచనాలు లేకుండా ఎన్నో హారర్, కామెడీ చిత్రాలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఆ కోవలోనే వచ్చిన చిత్రం రారా. అయితే కథ, కథనాలు ఏ మాత్రం ఆకట్టుకునే విధంగా లేకపోవడం ఈ చిత్రానికి మైనస్ పాయింట్. హారర్, కామెడీ చిత్రాలను ఆదరించే వారికి ఈ సినిమా కనెక్ట్ కావడం కష్టమే. సరైన కథ , కథనం , థ్రిల్ చేసే సన్నివేశాలు పూర్తిగా లోపించాయి. హీరో శ్రీకాంత్, షకలక శంకర్ ల నటన మినహా ఈ చిత్రంలో ఇంప్రెస్ చేసే అంశాలు దొరకవు.

Please follow and like us: