పందెం కోడి-2 రివ్యూ

సంగీతం: యువన్ శంకర్ రాజా
ఛాయాగ్రహణం: శక్తివేల్
నిర్మాతలు: విశాల్-ధవల్ జయంతిలాల్-అక్షయ్ జయంతిలాల్
కథ-స్క్రీన్ ప్లే-దర్శకత్వం: లింగుస్వామి
నటీనటులు: విశాల్-కీర్తి సురేష్-రాజ్ కిరణ్-వరలక్ష్మి శరత్ కుమార్-రాందాస్ తదితరులు
విడుదల : 18-10-2018
రేటింగ్ : 2. 75 / 5

మాస్ హీరోగా ఇమేజ్ తెచ్చుకున్న హీరో విశాల్ కు తెలుగులో స్టార్ ఇమేజ్ తెచ్చిపెట్టిన సినిమా ( తమిళంలో సైన్డయ్ కోళి ) పందెం కోడి. చాలా రోజుల క్రితం వచ్చిన ఆ సినిమాకు సీక్వెల్ గా పందెంకోడి 2 తో మళ్ళీ మన ముందుకు వచ్చాడు. లింగుస్వామి దర్శకత్వంలోనే రూపొందించాడు. దసరా కానుకగా మంచి అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ చిత్రం ఆ అంచనాల్ని ఏమాత్రం అందుకుందో తెలియాలంటే కథలోకి వెళ్లసిందే ..

కథ:

బాలు (విశాల్) కడప జిల్లాలో కొన్ని ఊర్లుకు పెద్దగా ఉండే రాజా రెడ్డి (రాజ్ కిరణ్) కొడుకు. కొన్నాళ్లు ఫ్యాక్షన్ గొడవల్లో తలమునకలై ఉన్న అతను.. తర్వాత విదేశాలకు వెళ్తాడు. మరోవైపు ఇక్కడ ఫ్యాక్షన్ గొడవలు ముదురుతాయి. ఒక గొడవలో తన భర్త ప్రాణాలు కోల్పోయిన భవాని (వరలక్ష్మి).. రాజా రెడ్డి కుటుంబం కాపాడుతున్న ఓ వ్యక్తిని చంపడానికి కంకణం కట్టుకుంటుంది. ఇలాంటి సమయంలో బాలు తిరిగి సొంత ఊరికి వస్తాడు. కొన్నేళ్లుగా ఆగిపోయిన ఊరి జాతరను వైభవంగా జరిపించి.. ఫ్యాక్షన్ గ్రామాల్లో శాంతి నెలకొల్పడానికి రాజారెడ్డి ప్రయత్నిస్తుంటే.. భవాని మనుషులు అడ్డం పడుతుంటారు. వారిని అడ్డుకుని తండ్రి సంకల్పాన్ని బాలు ఎలా నెరవేర్చాడు అన్నది మిగతా కథ.

నటీనటుల ప్రతిభ :

విశాల్ పర్ఫెక్టుగా సూటయ్యే పాత్రకు పూర్తి న్యాయం చేశాడు. యాక్షన్ ఘట్టాల్లో.. ఎమోషనల్ సీన్లలో అతడి స్క్రీన్ ప్రెజెన్స్ బాగుంది. ఎక్కడా ఓవర్ అనిపించకుండా నెట్టుకొచ్చాడు. కీర్తి సురేష్ కూడా బాగా చేసింది. ఆమె కెరీర్లో మరో గుర్తుంచుకోదగ్గ పాత్ర ఇది. ‘పందెంకోడి’లో మీరా జాస్మిన్ తరహాలో .. అల్లరి పిల్లగా కీర్తి కూడా బలమైన ముద్ర వేసింది. అసలు కీర్తిని ఈ యాంగిల్ లో కూడా చూడొచ్చా అన్న అనుమానాలను పటాపంచలు చేసింది. ‘మహానటి’ తర్వాత కీర్తికిది మేకోవర్ అని చెప్పొచ్చు. డ్యాన్సుల్లో కీర్తి ఎనర్జీ ఆకట్టుకుంటుంది. హీరో తండ్రిగా కీలకమైన పాత్రలో రాజ్ కిరణ్ కూడా మెప్పించాడు. విలన్ గా వరలక్ష్మి పెర్ఫామెన్స్ బాగుంది. పతాక సన్నివేశంలో ఆమె నటన ఆకట్టుకుంటుంది. మిగతా నటీనటులంతా జస్ట్ ఓకే. ఐతే ‘పందెంకోడి’కి ఆకర్షణగా నిలిచిన.. యాక్షన్ ఎపిసోడ్లు.. హీరో ఎలివేషన్ సీన్లు.. హీరోయిన్ పాత్ర నేపథ్యంలో సాగే కామెడీ.. రెండో భాగంలోనూ కనిపిస్తాయి. ఇందులో మాస్ ప్రేక్షకులు కోరుకున్నట్లే భారీ పోరాట దృశ్యాలు చూడొచ్చు. వాటిని తీర్చిదిద్దిన విధానం సినిమాకు ఆకర్షణగా నిలిచింది.

టెక్నీకల్ హైలెట్స్ :

మాస్ కథల్ని క్లాస్ కు కూడా నచ్చేలా చెప్పడం దర్శకుడు లింగుస్వామి స్టయిల్. ‘ మాస్ అంశాలకు లోటు ఉండదు. కానీ ఆ కథల్ని స్టైలిష్ గా ప్రెజెంట్ చేసి అందరికీ ఆమోద యోగ్యంగా మార్చాడు లింగుస్వామి. ఎలాంటి ఇమేజ్ లేని విశాల్ ను కూడా ‘పందెంకోడి’లో మాస్ హీరోగా చూపించి మెప్పించాడతను. ఇప్పుడు దీని సీక్వెల్ వచ్చే సమయానికి విశాల్ పెద్ద మాస్ హీరో అయ్యాడు. వరుస విజయాలతో మాంచి ఊపు మీద ఉన్నాడు. ‘పందెంకోడి-2’ నుంచి ప్రేక్షకులు ఎలాంటి అంశాలు ఆశిస్తారన్నది కూడా లింగుస్వామికి తెలుసు. ఈ అడ్వాంటేజీల్ని అతను పూర్తిగా ఉపయోగించుకోలేకపోయాడు. మాస్ ప్రేక్షకుల్ని దృష్టిలో ఉంచుకుని యాక్షన్ ఎపిసోడ్లు.. హీరో ఎలివేషన్ సీన్లు బాగానే సెట్ చేసుకున్నాడు కానీ.. అన్నింటికంటే ముఖ్యమైన కథ విషయంలో మాత్రం లింగుస్వామి సరైన కసరత్తు చేయలేదు. ఇక యువన్ శంకర్ రాజా నేపథ్య సంగీతంతో సినిమాకు పిల్లర్ లాగా నిలిచాడు. చక్కటి బ్యాగ్రౌండ్ స్కోర్ అందించాడు. జాతర నేపథ్యంలో సాగే సన్నివేశాలకు.. యాక్షన్ ఎపిసోడ్లకు అతను నేపథ్య సంగీతం బలంగా నిలిచింది. పాటలు పర్వాలేదు. శక్తివేల్ ఛాయాగ్రహణం ఓకే. నిర్మాణ విలువలు బాగున్నాయి.

చివరగా :

‘పందెం కోడి’కి ప్రధాన ఆకర్షణగా నిలిచింది హీరో-విలన్ మధ్య సాగే సంఘర్షణ. హీరో పాత్రను సింపుల్ గా మొదలుపెట్టి.. తర్వాత దాన్ని భారీగా రూపొందించాడు. విలన్ పాత్రను కూడా బలంగా తీర్చిదిద్దడం వల్ల సినిమాకు బలమైంది. ఐతే ‘పందెంకోడి-2’లో ఇలాంటి ప్లస్ పాయింట్స్ కనిపించవు. ఇక్కడ విలన్ పాత్రలో అంత బలం లేకపోవడం, హీరో-విలన్ మధ్య డైరెక్ట్ పోరు ఏమీ లేకపోవడం.. కాన్ఫ్లిక్ట్ పాయింట్ కూడా చాలా చిన్నది కావడంతో ప్రేక్షకుల్లో ఎమోషన్ ఏమీ ఉండదు. మరోవైపు తమిళనాడు పల్లెల్లో జరిగ జాతర నేపథ్యం సినిమా అంతటా కనిపించడంతో తెలుగు ప్రేక్షకులకు కొంచెం ఇబ్బందే. కథ పరంగా చూస్తే మాత్రం చెప్పుకోదగ్గ మలుపులు.. విశేషాలేమీ కనిపించవు. చిన్న పాయింటుని బాగా సాగదీశాడు. హీరో ఇంట్లోని ఒక మనిషిని చంపడానికి విలన్లు పదే పదే ప్రయత్నించడం.. హీరో అడ్డుకోవడం.. దీని మీదే సినిమా అంతా సాగడం వల్ల ఒక దశ దాటాక విసుగు పుడుతుంది. ద్వితీయర్ధంలో వినోదమే లేకపోవడం.. సీన్లు రిపీటెడ్ గా అనిపించడంతో బోర్ కొడుతుంది.

Please follow and like us: