మానవతను చాటుతున్న మనం సైతం

ప్రముఖ నటుడు కాదంబరి కిరణ్ నిర్వహిస్తున్న మనం సైతం సేవా సంస్థ మానవతను చాటుకుంటోంది. తెలుగు చిత్ర పరిశ్రమలోని 24 విభాగాల కార్మికులకే కాకుండా దేశంలో ఎక్కడ ఏ విపత్తు జరిగినా తమ వంతు సహాయం అందిస్తున్నారు. కేరళ తుఫాన్, తిత్లీ తుఫాన్ బాధితులకు నిత్యావసరాలు ఆర్థిక సాయం అందించిన మనం సైతం సంస్థ…భూదాన్ పోచంపల్లి నేతన్నలకు అండగా నిలబడింది. హైదరాబాద్ ఫిలిం ఛాంబర్ లో జరిగిన కార్యక్రమంలో పేదలకు ఆర్థిక సహాయం అందజేశారు. ఈ కార్యక్రమంలో నటి, నిర్మాత మంచు లక్ష్మీ ప్రసన్న, నిర్మాతలు కేెెఎల్ నారాయణ, దామోదర ప్రసాద్, నటుడు నందు, గాయకుడు శ్రీకృష్ణ, బుల్లితెర దర్శకుడు మీర్, జాయింట్ లేబర్ కమిషనర్ డాక్టర్ గంగాధర్, స్మార్ట్ ఏపీ ఫౌండేషన్ సీఈవో డాక్టర్ గంగయ్య తదితరులు పాల్గొన్నారు. అతిథుల చేతుల మీదుగా నేతన్నలు బైల నరసింహా, బోగ హరిప్రసాద్, పరిశ్రమకు చెందిన బొంగు గణేష్, వేణుగోపాల్, గారిబాబు, ఇసంపల్లి రహేలు, లలిత, హరిత శ్రావణిలకు చెక్ లు అందజేశారు. ఈ సందర్భంగా కాదంబరి కిరణ్ మాట్లాడుతూ…చిత్ర పరిశ్రమలో అనేక చేదు అనుభవాలు చూశాను. వాటిని గురించి, కారణమైన వాళ్లను గురించి ఆలోచించే కంటే ఆ శక్తిని పేదలకు ఉపయోగపడేందుకు వినియోగించాలనుకున్నాను. పేదలకు చాలినంత డబ్బు ఇవ్వలేకున్నా, గుండెల నిండా ధైర్యాన్నివ్వాలి అనే సంకల్పంతో నాలుగేళ్ల క్రితం మనం సైతం ప్రారంభించాను. నా తోటి హాస్య నటుడు పొట్టి రాంబాబు చనిపోతే..ఆ విషయం నాకు తెలిసి పరిశ్రమలోని కొందరిని కొంత డబ్బు సహాయం చేయమని అడిగాను. వాళ్లెవరూ స్పందించలేదు. ఒక వ్యక్తి వచ్చి మంచు లక్ష్మి ఇమ్మని చెప్పారని 20 వేల రూపాయలు ఇచ్చి వెళ్లారు. మంచు లక్ష్మి గొప్ప హృదయం అది. ఇలాంటి వాళ్లంతా మనం సైతం కార్యక్రమాలకు అండగా నిలబడుతుంటే ఎంతో శక్తి వచ్చినట్లు అనిపిస్తోంది. ఇటీవల భూదాన్ పోచంపల్లి వెళ్లాను. అక్కడ చేనేత కార్మికుల జీవితాలు దుర్భరంగా ఉన్నాయి. వారిలో బైల నరసింహా, బోగ హరిప్రసాద్ లకు ఇవాళ సాయం చేస్తున్నాం. మనం సైతం ఎప్పుడైనా ఎక్కడికైనా సాయం అందించేందుకు సిద్ధంగా ఉందని చెబుతున్నాను. అన్నారు. నిర్మాత కేఎల్ నారాయణ మాట్లాడుతూ…కాదంబరి గారు నాకు చాలా కాలంగా తెలుసు. ఆయన ఇంత పెద్ద సేవా సంస్థను నడిపిస్తున్నారని ఆలస్యంగా తెలిసింది. పరిశ్రమలోనే కాదు బయట అవసరంలో ఉన్న వాళ్లకు సహాయం చేస్తున్నారు. ఇలాంటి కార్యక్రమాలకు ప్రచారం అవసరమా అని మొదట అనిపించింది కానీ…ఎంత ఎక్కువ మందికి తెలిస్తే అంత సహాయం పేదలకు చేయగలం అని తెలుస్తోంది. సేవకు ప్రాంతం అనే బేధం లేదు. ప్రకృతి విలయాలు ఎప్పుడు వచ్చినా చిత్ర పరిశ్రమ ప్రభుత్వాలతో పాటు నిలబడుతోంది. హుదూద్ వచ్చినప్పుడు మేమంతా కలిసి 15 కోట్ల రూపాయలు సహాయం అందించాం. పరిశ్రమ అంతా కలిసి చేయడం వేరు ఒక్క కాదంబరి ముందుకొచ్చి సహాయ కార్యక్రమాలు చేయడం వేరు. ఆయన సేవా దృక్పథాన్ని అభినందిస్తున్నాను. అన్నారు.

Please follow and like us: