ఎటువైపో నీ పరుగు ప్రారంభం


క్రాంతి, పృధ్వి, అవంతిక హీరోహీరోయిన్లుగా రూపొందుతున్న చిత్రం ఎటువైపో నీ పరుగు. మద్దినేని రమేష్ బాబు దర్శకత్వం వహిస్తున్నారు. సాయిశాన్వి క్రియేషన్స్ పతాకంపై వి.అలేఖ్య, పి.రాంబాబు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం ప్రారంభోత్సవం శుక్రవారం హైదరాబాద్ లోని అన్నపూర్ణా స్టూడియోస్ లో జరిగింది. హీరోహీరోయిన్లు ముగ్గురిపై తీసిన తొలి సన్నివేశానికి భీమనేని శ్రీనివాసరావు క్లాప్ కొట్టగా…దామోదరప్రసాద్, శ్రీవాస్ కెమెరా స్విచ్చాన్ చేశారు. వి.సాగర్ గౌరవ దర్శకత్వం వహించారు. చదలవాడ శ్రీనివాసరావు, పోకూరి బాబూరావు, కల్యాణకృష్ణ, టి.ప్రసన్నకుమార్ తదితర సినీ ప్రముఖులు ఈ కార్యక్రమానికి విచ్చేసి, చిత్రబృందానికి శుభాకాంక్షలు అందజేశారు. అనంతరం జరిగిన పాత్రికేయుల సమావేశంలో చిత్ర దర్శకుడు మద్దినేని రమేష్ బాబు మాట్లాడుతూ, ఇద్దరు అబ్బాయిలు, ఒక అమ్మాయి మధ్య సాగే ముక్కోణపు ప్రేమకథా థ్రిల్లర్ చిత్రమిది. హైదరాబాద్, వైజాగ్ లలో షూటింగ్ జరుపుతాం. నవంబర్, డిసెంబర్ మాసాల్లో జరిగే రెండు షెడ్యూల్స్ లో చిత్రీకరణను పూర్తిచేసి, ఫిబ్రవరిలో సినిమాను విడుదలచేస్తాం అని చెప్పారు. మంచి కథాబలం ఉన్న ఈ చిత్రం అవకాశం రావడం పట్ల హీరో పృధ్వి ఆనందాన్ని వ్యక్తంచేయగా..ఈ చిత్రంలో రెండో ప్రధాన పాత్రను పోషిస్తుండటంతో పాటు కథను కూడా తాను అందించానని క్రాంతి తెలిపారు. హీరోయిన్ అవంతిక మాట్లాడుతూ, తాను నటిస్తున్న తొలి చిత్రమిదని, తన ప్రతిభను ఈ చిత్రం ద్వారా నిరూపించుకుంటానని అన్నారు. సంగీత దర్శకుడు వి.కిరణ్ కుమార్ మాట్లాడుతూ, ఇందులో ఆరు పాటలున్నాయని, వీటికి కొత్తరకమైన సంగీతాన్నిఅందించడం జరిగిందని చెప్పారు. ఈ కార్యక్రమంలో మాటల రచయితలలో ఒకరైన శ్రీనివాస్ పాల్గొన్నారు.

Please follow and like us: