2.0 review

సంగీతం : ఏఆర్ రెహమాన్
ఛాయాగ్రహణం: నీరవ్ షా
ఎడిటింగ్ : అంటోనీ
నిర్మాణం : లైకా
కథ – స్క్రీన్ ప్లే – దర్శకత్వం : శంకర్
నటీనటులు: రజనికాంత్ – అమీ జాక్సన్ – అక్షయ్ కుమార్ – సుధాంశు పాండే – ఆదిల్ హుసేన్ – కళాభవన్ షాజాన్ – తదితరులు
విడుదల : 29 – 11-2018
రేటింగ్ : 3 స్టార్స్

భారీ సినిమాలను తీయడంలో శంకర్ సిద్ధహస్తుడు .. ఇదివరకే సూపర్ స్టార్ రజని కాంత్ తో అయన తీసిన రోబో సంచలన విజయం సాధించడంతో దానికి సీక్వెల్ గా 2. 0 సినిమాను భారీ బడ్జెట్ తో తెరకెక్కించాడు. ఇండియన్ సినిమా చరిత్రలో అత్యధిక బడ్జెట్ తో తెరకెక్కిన చిత్రంగా రికార్డు క్రియేట్ చేసింది. ఈ సినిమా విజువల్ ఎఫెక్ట్ గా భారీ సాంకేతిక పరిజ్ఞానంతో తెరకెక్కిన ఈ సినిమా అత్యధిక థియేటర్స్ లో ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. రోబో సీక్వెల్ తో పాటు పూర్తిగా 3డిలో రూపొందించిన మూవీ కావడంతో అంచనాలు రెట్టింపయ్యాయి. తమిళ్ లో కంటే తెలుగులోనే బాగా ఆడతాయని పేరు తెచ్చుకున్న శంకర్ సినిమాల బాటలోనే 2.0 కూడా ఇక్కడే పెద్ద విడుదలను దక్కించుకుంది. మరి ఈ 2. 0 కథేమిటో తెలుసుకుందామా ..

కథ :

చెన్నై సిటీలో ఓ రోజు హఠాత్తుగా అందరి చేతుల్లో సెల్ ఫోన్లు గాల్లోకి ఎగిరిపోతుంటాయి. దానికి కారణం ప్రభుత్వానికి అంతు చిక్కదు. దానికి తోడు .. మొబైల్ షో రూమ్ ఓనర్, మొబైల్ కంపెనీ సీఈఓ. అలాగే టెలికాం మినిస్టర్లు ఆ అదృశ్య శక్తి ద్వారా హత్య చేయబడతారు. దాన్ని పట్టుకోవడానికి సైంటిస్ట్ వసీకర్ (రజనీకాంత్) సహాయం కోరుతుంది గవర్నమెంట్. తన అసిస్టెంట్ హ్యూమనాయిడ్ రోబో వెన్నెల (అమీ జాక్సన్)సహయంతో రోబో ని పార్టులుగా విడగొట్టి మ్యూజియం లో పెట్టిన చిట్టి (రజనీకాంత్)కి తిరిగి ప్రాణం పోస్తాడు వసీకర్. ఆ ఆతరువాత రంగంలోకి దిగిన చిట్టి .. ఇదంతా ఎవరు చేస్తున్నారో తెలుసుకుంటుంది. గతంలో ఉరి వేసుకుని చనిపోయిన పక్షి రాజు (అక్షయ్ కుమార్) చేస్తున్నాడని తెలుసుకుంటుంది. దాన్ని అడ్డుకుని భద్రంగా బంధిస్తారు .. అయితే డేరా బోణి డాక్టర్ కొడుకు బోరా
దాన్ని అక్కడినుండి దొంగిలించి కొత్త శక్తి ఇవ్వాలని ట్రై చేస్తాడు .. కానీ అక్కడనుండి తప్పించుకున్న పక్షిరాజు .. బోరా ని చంపేస్తుంది .. ఇకపై ఫోన్ వాడుతున్న ప్రతి ఒక్కరిని చంపేస్తానని పక్షిరాజు ప్రయత్నం చేస్తుంటాడు. పక్షిరాజును అడ్డుకునేందుకు వాసికార్ చేస్తున్న ప్రయత్నాలు అడ్డుకోవాలని వాసికార్ లోకి పక్షిరాజు ఆత్మ ఎంటర్ అవుతుంది. పక్షిరాజు భారీ విద్వాంసానికి ప్రయత్నాలు చేస్తున్నప్పుడు చిట్టి అడ్డుకోవడంతో .. చిట్టిని ముక్కలు ముక్కలు చేస్తాడు పక్షిరాజు .. ఆ తరువాత వెన్నెల సహాయంతో చిట్టి 2. 0 గా మారతాడు ..ఆ తరువాత జరిగిన పరిణామాలు ఏమిటి అన్నది మిగతా సినిమా.

నటీనటుల ప్రతిభ :

సూపర్ స్టార్ గా ఓ రేంజ్ మాస్ ఇమేజ్ ఉన్న రజినీకాంత్ ఇమేజ్ చట్రం నుంచి దూరంగా మాస్ ఫార్ములాకు భిన్నంగా రోబో ఒప్పుకున్నప్పుడు అందరికి సందేహాలు కలిగాయి .. అయితే ఆ సందేహాలు పటాపంచలు చేస్తూ రోబోతో భారీ విజయాన్ని అందుకుని తాను దేనికైనా సిద్దమే అని చాటి చెప్పాడు. ఇంత వయసులోనూ అంత శ్రమను ఓర్చుకుని కష్టపడిన తీరుకి హాట్స్ ఆఫ్ అనే మాట చిన్నదే. వశీకరన్ కంటే రెండు పాత్రల చిట్టిగా మొత్తం వన్ మ్యాన్ షో చేసాడు రజని. ఇంత ఈజ్ తో మెప్పించడం తలైవాకే చెల్లింది. రజనిని తప్ప చిట్టిగా ఇంకెవరిని ఊహించుకోలేను అన్న శంకర్ మాటకు పూర్తి న్యాయం జరిగింది. అసలు కొన్ని సన్నివేశాల్లో రజని నటన అద్భుతం. ముఖ్యంగా ప్రీ క్లైమాక్స్ నుంచి 2.0గా మినీ రోబోగా రజని ఓహో అనిపించాడు . పక్షిరాజు అక్షయ్ కుమార్ విలనీ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. మేకప్ కోసమే కఠోరమైన శ్రమ పడ్డ అక్షయ్, శారీరకంగా మానసికంగా పడిన కష్టం తెరమీద కూడా కనిపిస్తుంది. ఫ్లాష్ బ్యాక్ లో పక్షుల బాగు కోసం తపించిపోయే వృద్ధుడిగా అద్భుత నటన ఇచ్చాడు. అసలు ఈ పాత్రను స్టార్ ఒప్పుకోవడమే సాహసం. అమీ జాక్సన్ ఉన్నంతలో చక్కగా చేసింది .. అయితే ఆమెని గ్లామర్ కోణంలో చూడలేం. వీళ్ళు కాకుండా సినిమాలో గుర్తుండేలా పెద్దగా ఆకట్టుకునే నటీనటులు ఎవరు ఉండరు. రోబో విలన్ డానీ కొడుకు(సుధాంశు పాండే)గా ఓ పాత్రను పెట్టారు కానీ కథనంలోని బలహీనత వల్ల తేలిపోయింది.

టెక్నీకల్ హైలెట్స్ :

భారీ కమర్షియల్ హంగులు ఉన్న సినిమాలకు కేర్ అఫ్ అడ్రస్ గా మారిన శంకర్ నుండి వచ్చిన మరో విజువల్ వండర్ గా ఈ సినిమాను చెప్పుకోవాలి. పక్షులు అంతరించిపోవడం వల్ల మానవాళికి ఎంత ప్రమాదమో హెచ్చరించే పాయింట్ లో మంచి విషయం ఉంది, ది. కాని దాన్ని పక్షి రాజు మనుషుల మీద ప్రతీకారం తీర్చుకోవడం తప్ప ఇంకే పరిష్కారం లేదు అనేలా కథనం రాసుకోవడంతో కథ పక్కకు జరిగిన ఫీలింగ్ కనిపిస్తుంది. తనలోని బెస్ట్ టెక్నీషియన్ ని శంకర్ ఇందులో మరోసారి ఆవిష్కరించాడు. హాలీవుడ్ సినిమాల్లో మాత్రమే చూసే టాప్ మేకింగ్ ని తనదైన శైలిని ఇండియన్ స్క్రీన్ మీద ఆవిష్కరించాడు. ఎంతసేపూ పక్షిరాజు రాక్షస ప్రవర్తన తప్ప అతనిలో సదుద్దేశం విసిగిస్తుంది. కథలో టెంపో లేదే అనే ఫీలింగ్ కలిగిస్తాడు శంకర్. ఆయన మీద గౌరవం కొన్ని లోపాలను కప్పిపుచ్చేలా చేస్తుంది. తన సినిమాల్లో ఏదో ఒక సోషల్ మెసేజ్ తప్పకుండా ఉండేలా చూసుకునే శంకర్ ఇందులో కూడా మంచి పాయింట్ తీసుకున్నాడు. కాకపోతే ఎమోషనల్ గా కనెక్ట్ అయ్యే బ్లాక్ ఏదీ లేకపోవడంతో ఏదో హాలీవుడ్ మూవీ చూస్తున్న ఫీలింగ్ కలుగుతుంది. ఫస్ట్ హాఫ్ లో ప్రీ ఇంటర్వెల్ దాకా కథ ముందుకు వెళ్ళకపోవడం కొంత మైనస్ అయ్యింది. సెల్ ఫోన్స్ మాయం కావడానికి అదృశ్య రూపంలో పక్షిరాజుకి బిల్డప్ ఇచ్చే సీన్స్సా గదీసినట్టు అనిపిస్తుంది. స్థూలంగా చూస్తే 2.0-పక్షిరాజు మధ్య పోరాటం తప్ప ఇందులో కథేమీ లేదు. కాకపోతే ఇంత గ్రాండియర్ స్కేల్ మీద హాలీవుడ్ స్థాయిలో గ్రాఫిక్స్ ప్రెజెంట్ చేయాలన్న శంకర్ తపన మెచ్చదగినదే కానీ ఫస్ట్ పార్ట్ లాగా ఎమోషన్స్ కూడా సరైన పాళ్ళలో మిక్స్ చేసుకుని ఉంటె దీని రేంజ్ వేరుగా ఉండేది. ఏఆర్ రెహమాన్ సంగీతంలో విశేషమంతా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ లోనే ఉంది. ఉన్న రెండు పాటలు బాగున్నాయి. తన పనితనం మొత్తం బిజిఏంలోనే చూపించారు రెహమాన్. నీరవ్ షా కెమెరా పనితనం గురించి ఎంత చెప్పినా తక్కువే. క్లైమాక్స్ ని చిత్రీకరించిన తీరు నభూతో అని చెప్పొచ్చు. రియాలిటీ కంటే గ్రాఫిక్స్ ఎక్కువగా ఉండే క్లైమాక్స్ లో ఆయన పనితనాన్ని చూడొచ్చు. ఫైట్లు అదిరిపోయాయి. అంటోనీ ఎడిటింగ్ సూపర్. లైకా నిర్మాణ విలువలు అబ్బుర పరుస్తాయి.

చివరగా :

రోబో మొదటి భాగం కేవలం గ్రాఫిక్స్ వల్ల అంత పెద్ద విజయం సాధించలేదు. సాంకేతిక టెక్నాలజీ, దానికి తోడు కామెడీ – లవ్ – రొమాన్స్ – యాక్షన్ – ఎమోషన్స్ – సెంటిమెంట్ ఇలా నవరసాలు నింపి మూడు గంటల సేపు మాయ ప్రపంచంలోకి తీసుకెళ్లాడు. దీంతో 2.0లో అంతకు మించి ప్రేక్షకులు ఆశించడం సహజం. కానీ శంకర్ ఈసారి విజువల్ మాయాజాలంలో పడిపోయి ఆ నవరసాలను పక్కన పెట్టేసాడు. అత్యున్నత సాంకేతిక ప్రతిభ అడుగడుగునా కనిపించినప్పటికీ సరైన కథను మాత్రం అందుకోలేదు. శంకర్ చెప్పినట్టుగా గ్రాఫిక్స్ క్వాలిటీ విషయంలో తాను పూర్తి సంతృప్తి చెందలేదు అన్న మాట కొన్ని సీన్స్ లో నిజమే అనిపిస్తుంది. టెక్నాలజి ఆధారంగా చేసుకునే ఇలాంటి కథల్లో చిక్కులు ఉంటాయి. హీరొయిన్ బదులు రోబో రూపంలో అమీని సెట్ చేయడం పాటలు కామెడీ ఎంటర్ టైన్మెంట్ లోపించడం ఇవన్ని సాధారణ ప్రేక్షకులకు 2.0ని పూర్తిగా కనెక్ట్ కాకుండా అడ్డుపడతాయి. అసలు పక్షిరాజు ఆత్మ పక్షుల ఆత్మలతో జత కూడి అంత శక్తిమంతంగా ఎలా మారింది అనేది లాజిక్ కి దూరంగా ఉంది. ఇలాంటి కొన్ని విషయాలు పక్కన పెడితే .. శంకర్ మూడేళ్ళ కృషికి హాట్స్ ఆఫ్ చెప్పాల్సిందే. రోబో 2. 0 ని విజువల్ వండర్ అని చెప్పాల్సిందే.

Please follow and like us: